గోరుచిక్కుడు కాయగూరగ, పశుగ్రాసంగా, జిగురు ఉత్పత్తి కోసం దేశవ్యాప్తంగా సాగులో ఉన్న పంట ఇది. వర్షాధారంగా అంతగా సారవంతం కాని భూముల్లోనూ కూడా బాగా పండుతుంది. నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకోగలదు. గింజలో 18 శాతం ప్రోటీన్, 32 శాతం పీచు పదార్థాలు, 30-33 శాతం జిగురు ఉంటుంది. భారత్ నుంచి విదేశాలకు ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో ‘గోరు చిక్కుడు’ జిగురు ప్రధానమైనది. రాజస్థాన్ లాంటి నీటి ఎద్దడి రాష్ట్రాల్లో రైతులకు మేలైన ఆదాయాన్ని అందిస్తున్న పంట. మన రాష్ట్రంలోని పాత నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో ఈ పంట సాగుకు మిక్కిలి అనుకూల వాతావరణం ఉన్నది.

వాతావరణం

గోరు చిక్కుడు ఉష్ణమండల పంట. సాగు చేయడానికి వేడి వాతావరణం అవసరం. తొలిదశలో ప్రత్యేకించి మొలకెత్తే సమయంలో పంటకు 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. శాఖీయ దశలో 32-38 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. పూత దశలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పంట పొడువుగా పెరుగుతుంది. గాలిలో అధిక తేమతో ఆకు మాడు, వేరు కుళ్లు సమస్య ఎక్కువవుతుంది.

నేలలు

ఉదజని సూచిక 7-8.5 మధ్య ఉండి మధ్యస్త, తేలికపాటి నుంచి నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. నీటి నిల్వ భూములు, నల్లరేగడి భూములు ఈ పంటకు అంతగా అనుకూలం కాదు. అధికంగా గాలిలో తేమ ఉండే నేలల్లో ఈ పంట వేయకపోవడమే మేలు.

నేల తయారీ

నేలలో నీరు ఇంకే విధంగా తయారుచేయాలి. ముందుగా వేసవిలో లోతు దుక్కి చేసి, ఆ తర్వాత రెండు, మూడుసార్లు దుక్కి చేయాలి. నీరు ఇంకే నేల తయారీ ఉండాలి. ఇది పప్పుధాన్యపు పంట. కాబట్టి భూమిలో నత్రజనిని స్థాపించి భూసారాన్ని పెంచుతుంది.

రకాలు
కాయగూరల కోసం: పూసా నవబాహార్, పూసా సదా బాహార్, దుర్గా బాహార్

విత్తనాల జిగురు కోసం: హెచ్-365

విత్తనం నాటే సమయం

వర్షాధార ప్రాంతాల్లో జూలై చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనం నాటడం పూర్తి చేయాలి. ఆ తర్వాత వేసే పంటలో దిగుబడి తగ్గిపోతుంది.

విత్తటం

చాలామంది రైతులు విత్తనం వెదజల్లుతుంటారు. అయితే సిఫార్సు మేరలో ఎకరాలో మొక్కల సాంద్రత ఉండేలా చేసేందుకు, మొలక శాతం పెరిగేందుకు, అంతర సేద్యపు పనులకు వరుసలలో నాటాలి. శాఖలు, కొమ్మలు ఉత్పత్తి చేసే రకాలను వరుసల మధ్య 50 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ దూరంతో నాటుకోవాలి. ఏక కాండం ఉండే రకాలయితే వరుసల మధ్య 30 సెం.మీ దూరం సరిపోతుంది. నాగలితో లేదా సీడ్ డ్రిల్తో విత్తనం వేయాలి.

విత్తన మోతాదు

ఎకరాకు 6 కిలోల చొప్పున విత్తనం వాడాలి. కిలోగ్రాము విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా లేదా 2 గ్రాముల కార్బండిజంతో శుద్ధి చేయాలి, ఆ తర్వాత రసం పీల్చే పురుగుల మందుతో శుద్ధి చేయాలి. సిఫార్సు చేసిన రైజోబియం జీవన ఎరువును కిలో విత్తనాలకు 40 గ్రాముల చొప్పున పట్టించాలి. 200 గ్రాముల బరువున్న రైజోబియం కల్చర్ను 250 గ్రాముల బెల్లం ద్రావకంతో కలిపి ఒక లీటరు నీటిలో ఉంచి ద్రావణం తయారుచేయాలి. అలాంటి రైజోబియం మిశ్రమ ద్రావణాన్ని విత్తనాలపై పొరగా ఏకరీతిగా పట్టించాలి. ఆ తర్వాత నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. 24 గంటలలోపు ఆరిన విత్తనాలను నేలలో విత్తాలి.

ఎరువులు

పప్పుజాతి పంట కాబట్టి పంట తొలి దశలో కొద్దిమొత్తంలోనే ప్రారంభ సిఫార్సుగా నత్రజని అవసరం. హెక్టారుకు 20 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం అవసరం. వీటిని విత్తనం నాటేటప్పుడే వేయాలి. విత్తటానికి 15 రోజుల ముందు హెక్టారుకు 2.5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేయటం మేలు.

నీటి యాజమాన్యం

ఉష్ణ, ఉప ఉష్ణ ప్రాంతాలలో గోరు చిక్కుడును పూర్తిగా వర్షాధారంగా పండించవచ్చు. అయితే పూత విత్తనం ఏర్పడే దశలో నీటి ఎద్దడి ఉంటే ఒక నీటి తడినివ్వాలి. పంట వ్యర్థాలను హెక్టారుకు 3-5 టన్నుల చొప్పున వేస్తే నేలలో తేమ: శాతం పెరుగుతుంది. వర్షాధార పరిస్థితులలో పంట విత్తిన 25, 45 రోజుల తర్వాత 0.1 శాతం థయో యూరియా పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి.

కలుపు యాజమాన్యం

గడ్డి జాతి, వెడల్పాటి ఆకు జాతి కలుపు సమస్య వానకాలంలో ఎక్కువ. పంట తొలి 30-35 రోజులలో కలుపు నివారణ చేపట్టాలి. 25, 45 రోజులలో రెండుసార్లు చేతితో కలుపు తీయాలి. కూలీల కొరత ఉంటే హెక్టారుకు 2.5- 3.3 లీటర్ల పెండిమిథాలిన్ కలుపు మందును 500 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు నాటిన రెండు రోజుల్లో పిచికారీ చేయాలి. లేదా పంట విత్తిన తర్వాత 20-25 రోజులకు హెక్టారుకు 400 గ్రాముల చొప్పున ఇమజితాపిర్ కలుపు మందును 500 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి కూడా కలుపు నివారించవచ్చు.

harvested cluster bean produce

దిగుబడి
వర్షాధార పంటలో ఎకరాకు 12-15 క్వింటాళ్లు.
నీటి వసతిలో ఎకరాకు 25-35 క్వింటాళ్లు.

జిగురు పంట సాగు చేసే రైతులు ముందుగా కొనుగోలుదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం మేల

teluguraitu.com team

Pidigam Nagaiah, Editor, teluguraitu.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow copy.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.