వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి.
వేసవిలో నారును నీడ క్రింద పెంచాలి. తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. నారుమళ్ళపై నైలాన్ వల ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్యను అధిగమించవచ్చు.
పొలంలో అముదం, మొక్కజొన్న లాంటి పంటలను నీడనిచ్చే విధంగా ఉత్తర దక్షిణ దిశలో నాటుకోవాలి. ఎండ తీవ్రతను తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చు.
వేసవిలో కొత్తగా నాటిన పండ్ల తోటల్లో మొదటి 3-4 సంవత్సరాలు అంతర పంటలుగా బెండ, సొర, బీర, గుమ్మడి, దోస, ఫ్రెంచి చిక్కుడు, గోరుచిక్కుడు వంటి కూరగాయపంటలను సాగుచేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు.
నేలలోని తేమను సంరక్షించే చర్యలు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితోపాటు జీవన ఎరువులను వాడితే మంచి ఫలితం వుంటుంది. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల గుల్లబారి, తేమను ఎక్కువ రోజులు పట్టివుంచి మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది. పాదుల్లో, రెండు వరుసల మధ్య వరిగడ్డి, వరి ఊక, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు లేదా పచ్చిరొట్ట ఎరువులను నేలపై పరిస్తే నేలలో తేమ సంరక్షించబడి మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో వుండటమేగాక కలుపు పెరుగుదలను అరికడుతుంది.
నీటి యాజమాన్యం:
ఉన్న కొద్దిపాటి నీటిని బిందు (డ్రిప్) లేదా తుంపర్ల (స్ప్రింక్లర్) పద్ధతిలో ఇవ్వటం వల్ల కొద్ది నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయ పంటలను పండించవచ్చు. ఒక ఎకరాకు సరిపడా నీటితో డ్రిప్పు ద్వారా 2 1/2 ఎకరాలలో, తుంపర్ల పద్ధతిలో 1 1/2 – 2 ఎకరాలలో సాగుచేయవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటలలో ఎండ తీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళ నీటిని పిచికారీ చేయాలి. వేసవిలో వంకాయలో కాయకోతకు ఒకటి రెండు రోజుల ముందు తప్పనిసరిగా తడినివ్వాలి. లేదంటే కాయలో చేదు ఎక్కువవుతుంది.
మొక్కల సాంద్రత పెంచుట :
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల మొక్కలను తక్కువ దూరంలో నాటుకొని మొక్కల సాంద్రత పెంచితే, విడిగా మొక్క
దిగుబడి తగ్గినప్పటికీ, ఎక్కువ మొక్కలుండడం వల్ల విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఇందుకోసం విత్తన మోతాదును పెంచాలి.
ఎరువులు : నత్రజనిని రెండు సమపాళ్ళుగా చేసి విత్తిన 25-30 రోజులకు, పూత పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వేయకూడదు. ఎరువులను
వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి.
కలుపు నివారణ, అంతరకృషి : కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2-3 తడుల తర్వాత మట్టిని
గుల్లచేయాలి.
మొక్కలు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై
పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా వుంటుంది.
సి.సి.సి. 250 మి.గ్రా. లేదా | మాలిక్ హైడ్రోజైడ్ 50 మి.గ్రా. లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేయవచ్చు.
కాకర, పొట్ల పంటలను తప్పనిసరిగా పందిరి వేసి, తీగలు పాకించాలి లేని యెడల పండు ఈగ బెడద ఎక్కువగా ఉంటుంది.
బెండలో బిందు, తుంపర నీటిని వాడితే నీరు ఆదా అవుతుంది
40° సెల్సియన్ల కంటీ ఉష్ణోగ్రత ఎక్కువైతే పిందె కట్టటం. తగ్గి పూత రాలి, దిగుబడులు తగ్గిపోతాయి. వేసవిలో ఆలస్యంగా విత్తిన మొక్క పెరుగుదల తగ్గి, పల్లాకు సమస్య ఎక్కువ. కాబట్టి విత్తన మోతారు పెంచాలి. ఉదాహారణకు: వర్షాకాలంలో బెండ లో ఎకరానికి 4 కిలోల విత్తనాలు వాడితే, వేసవిలో 8కిలోలు వాడాలి. జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు ఎత్తు కోవచ్చు.
వంకాయ: 4-5 రోజులకోకసారి నీరివ్వాలి. పెరుగుదల దశలో 1-2 శాతం యూరియా శ్రావణం (లీటరు నీటికి 10-20 గ్రా.) పిచికారీ చేస్తే అధిక దిగుబడితో పాటు 20 శాతం నత్రజని కూడా ఆదా చేయవచ్చు.
టమాటలో 28 °సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రల్లో సైతం కాయలు ఇచ్చే రకాలను సాగుకు ఎంచుకోవాలి. వేసవిలో ఆలస్యంగా విత్తినప్పుడు లీఫ్ కర్ల్ వైరస్ ఎక్కువగా సోకుతుంది. సకాలంలో విత్తాలి.
అన్ని పంటలలో పూత దశలో ప్లానోఫిక్స్ ను 10 లీటర్లు నీటికి 4.5 మి.లీ లేదా 2, 4-డి 10 మి.గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు డైమిధోయేట్ వంటి అంశర్వాహక కీటక నాశనులు పిచికారీ చేయాలి.
వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలను గుర్తించిన వెంటనే పీకి నాశనం చేయాలి. పొలం చుట్టూ జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి పంటలు వేయాలి .
వైరస్ తెగుళ్ళ యాజమాన్యము :
ఆరోగ్యవంతమైన పంట / నేల నుండి విత్తనాలు సేకరించాలి. వైరస్ తెగుళ్ళను తట్టుకొనే రకాలు వాడాలి. నాటే ముందు ట్రై సోడియం ఆర్థోఫాస్పేట్ ద్రావణంలో (150 గ్రా./లీటరు మంచి నీరు) పది నిమిషాలు నానబెట్టి, తర్వాత మంచి నీటిలో శుభ్రంగా కడిగి విత్తుకోవాలి. నారుమడికి 40 మెష్ వలలు / దోమతెరలు ఏర్పరచాలి. కంచె పంటలుగా జొన్న లేదా మొక్కజొన్న పంటలను వేయాలి. ఎప్పటికప్పుడు కలుపు తీయాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. అంతర్వాహిక కీటక నాశనులను వాడాలి.
షేడ్ నెట్ కింద నారు ఉత్పత్తి :
నారు దశలో మొక్కలకు సరిపడే కాంతి, నీడ, తేమ శాతం మాత్రమే అవసరం. షేడ్ నెట్లో ఇది సాధ్యపడుతుంది. మొదట 7-9 మీటర్లు పొడవైన సిమెంట్ లేదా రాతి స్తంభాలను 5-8 మీటర్ల దూరంలో నిలువుగా (3 అడుగులు లోతుగా) పాతాలి. వీటి పై భాగాన షేడ్ నెట్ తో ఇనుప తీగ సహాయంతో కప్పాలి. పక్కలను కూడా పురుగులు, కీటకాలు చోరబడకుండా తెరలు దించాలి. ఇందువల్ల తెల్ల దోమ, పేనుబంక, నల్లి వంటి వాటిని నియంత్రించవచ్చు. తద్వారా వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని నివారించవచ్చు.
గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస మరియు బూడిద గుమ్మడి వేసవి లో సాగుకు ముఖ్యమైనవి. వీటికి తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలం. ఇవి అధిక ఉష్ణోగ్రతను, ఎక్కువ మంచును తట్టుకోలేవు. ఉష్ణోగ్రత 25° – 35° సెం వద్ద తీగ పెరుగుదల బాగా ఉండి మంచి దిగుబడులు వస్తాయి. ఉష్ణోగ్రత 18° సెం. కంటే తక్కువ ఉన్నప్పుడు సాగు చేస్తే తీగ పెరుగుదల తగ్గి పూత, పిందె రావడం ఆలస్యమవుతుంది. అలాగే 36° సెం. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఆడపుష్పాల సంఖ్య తగ్గి, మగపుష్పాల సంఖ్య పెరగడం వల్ల దిగుబడి బాగా తగ్గుతుంది. అయితే, ఎరువును వేయాలి.
గుమ్మడి, పొట్ల : జూన్-జులై మరియు డిసెంబరు-జనవరి చివరి వరకు సొర, దోస, కాకర : జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు. బీర, బూడిద గుమ్మడి : ఫిబ్రవరి చివరి వరకు నాటుకోవాలి
teluguraitu team