పంట మొక్కలకు భాస్వరం అవసరం

మొక్కలు పెరగడానికి అవసరమయ్యే పోషకాలలో నత్రజని తర్వాత భాస్వరం రెండవ ప్రధాన పోషకం. భాస్వరం మొక్కల వేర్లు బాగా పెరగడానికి, భూమి నుంచి పోషకాలు సక్రమంగా తీసుకొనుటకు చాలా అవసరం. పంటలలో పిలకలు, రెమ్మలు బలంగా వృద్ధి చెంది, మొక్కలు దృఢంగా పెరగడానికి భాస్వరం ఉపయోగపడుతుంది. మొక్కలలో పూత బాగా వచ్చి పక్వానికి త్వరగా రావడానికి భాస్వం చాలా అవసరమౌతుంది. పంటలలో అధిక నత్రజని వాడకం వలన కలిగే అనర్థాలను తగ్గించుటలో భాస్వరం సహాయపడుతుంది, మొక్కలలో జరిగే జీవక్రియలకు అవసరమైన మాంసకృత్తులు, ఎంజైముల తయారీలో భాస్వరం కీలక పాత్ర పోషిస్తుంది. పంటలకు మొదటి 30 రోజులలో, పూత, గింజ / పిందె దశలో భాస్వం అసరం మొక్కలకు అధికంగా ఉంటుంది, భాస్వరం, నత్రజని, పొటాష్ పోషకాలు వలే భూమిలో సులభంగా నీటిలో కరిగి క్రింది పొరల్లోకి నష్టపోదు. ఇది ఎరువు వేసిన చోటే లేగిన బోయి భూమిలో కదలక ఉంటుంది. కాని మొక్క భాగాలలో భాస్వరం సులభంగా కదులుతూ అందుబాటులో ఉంటుంది.

  -మెరుగు భాస్కరయ్య, ఎడిఎ, వ్యవసాయశాఖ జిల్లా వనరుల కేంద్రం,   తిరుపతి.

భూముల్లో భాస్వరం లోపిస్తే

సాగు భూముల్లో భాస్వరం పోషకం అందుబాటు తగ్గితే మొక్కలలో వేర్లు సరిగా అభివృద్ధి చెందక బలహీనంగా ఉంటాయి. మొక్కలలో పెరుగుదల, పిలకలు లేదా రెమ్మలు వచ్చే శక్తి తగ్గిపోతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ, ఎర్రని ఉదారంగుకు మారుతాయి. పూత రావడం, పిందె / గింజలు ఏర్పడడం, పైరు పక్వానికి రావడం ఆలస్యమౌతుంది.

భాస్వరపు ఎరువులు

రైతులు తమ భూములకు, సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల ద్వారా పంట మొక్కలకు భాస్వరాన్ని సమకూరుస్తారు. పశువుల ఎరువు, పచ్చిరొట్ట వంటి సేంద్రియ ఎరువులు కొద్ది పాటి భాస్వరాన్ని మొక్కలకు సమకూర్చడమే కాకుండా భూమిలో అవి కుళ్ళేటప్పుడు విడుదలయ్యే సేంద్రియ ఆమ్లాలు, భూమిలో మొక్కలకు అందని స్థితిలో ఉన్న భాస్వరాన్ని అందేటట్లు చేస్తాయి. సంప్రదాయ సాగులో అధికంగా వాడే సేంద్రియ ఎరువుల అందుబాటు తగ్గిపోతుండడంతో నేడు రైతులు అధిక శాతం పోషకాలు కరిగిన రసాయనిక ఎరువులనే అధికంగా వాడుతున్నారు. రైతులు నేడు అధికంగా వాడే భాస్వరపు ఎరువులలో సింగిల్ సూపర్ పాస్పేటు (సూటి ఎరువు) డిపిఎ, 20:20:0, 10:26:26, 14:314:14, 15:15:15 మొదలైన వంటి కాంప్లెక్స్ ఎరువులలో ప్రధానంగా చెప్పుకోవచ్చును.

భాస్వరపు ఎరువుల వినియోగం

రైతులు తమ భూములకు వేసేసిన భాస్వరం ఎరువులలోని భాస్వరపు పోషకం పంట విత్తిన / నాటిన మొదటి 25-30 రోజుల వరకు మాత్రమే మొక్కలకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. తర్వాత భూమిలలో మిగిలిన భాస్వరం మొక్కలకు అందని స్థితిలలోనికి మారిపోతుంది. ఈ కారణంగా, పొలాలకు వేసిన భాస్వరం ఎరువులను కేవలం 20 నుండి 25 శాతం మాత్రమే మొక్కలు వినియోగించుకొంటాయి. అందుకే శాస్త్రవేత్తలు, అధికారులు పంటలకు సిఫారసు చేసిన మొత్తం భాస్వరం ఎరువును దుక్కిలోనే వేసుకోవాలని సిఫారసు చేస్తారు. పైపాటుగా భాస్వరం కలిగిన సూటి ఎరువుగాని, కాంప్లెక్స్ ఎరువు గాని పంటలకు సిఫారసు చేయడం లేదు. పైపాటుగా భాస్వరం ఎరువులు వేసినా, వినియోగం తక్కువగా ఉంటుంది కనుక రైతులకు ఖర్చు వృధా అవుతుందని శాస్త్రవేత్తలు పైపాటుగా సిఫారసు చేయడం లేదు.

భాస్వరం మొక్కలకు అందుబాటుకు అనువైన పరిస్థితులు

భూములకు రైతులు వేసిన భాస్వరం ఎరువులలోని భాస్వరం పోషకం మొక్కలకు అందుబాటు, అనేక పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది.

  • బంక భూములలో, వేరు ప్రాంతంలో గాలి ప్రసరణ సరిగా లేక, వేర్లకు ఆక్సిజన్ తగినంత అందపోవడంతో మొక్కలు భాస్వరాన్ని తగినంత వినియోగించుకోలేవు లేదా ఈ నేలలో మొక్కలకు భాస్వరం అందుబాటు తక్కువగా ఉంటుంది.
  • భూమిలో తగినంత వేడి (ఉష్ణోగ్రత) లేని, చలికాలంలో మొక్కలకు భాస్వరం అందుబాటు తక్కువగా ఉంటుంది.
  • నీటి ఎద్దడి లేదా బెట్ట పరిస్థితులలో కూడా మొక్కలకు భూమి నుండి భాస్వరం అందుబాటు తక్కువగా ఉంటుంది.
  • భూమిలో సేంద్రియ పదార్థం అధికంగా ఉన్నపుడు, సూక్ష్మజీవుల చర్య ఎక్కువగా ఉండడం వలన మొక్కలకు భాస్వరం అందుబాటు మెరుగ్గా ఉంటుంది. కాబట్టి సేంద్రియ ఎరువులు తగినంత వాడని భూమిల్లో, భాస్వరం అందుబాటు తక్కువగా ఉంటుంది.
  • ఉదజని సూచిక 6-7 మధ్య ఉన్న తటస్థ భూముల్లో భాస్వరం అందుబాటు అధికంగా ఉంటుంది.

ఉదజని సూచిక 6 కంటే తక్కువగా ఉన్న ఆమ్ల భూముల్లో 8 కంటే ఎక్కువ ఉన్న చౌడు / క్షార భూముల్లో భాస్వరం ఎరువులు తగినంత వాడినా, మొక్కలకు భాస్వరం అందుబాటు తక్కువగానే ఉంటుంది.

కాబట్టి పంట మొక్కలకు భాస్వరం పోషకం నేల నుంచి అందుబాటులో పెరగాల నేలలు గుల్ల బారి, అధిక సేంద్రియ పదార్థం కలిగి ఉదజని సూచిక తటస్థంగా ఉం విధంగా రైతులు చర్యలు తీసుకోవాలి.

రైతులు భూములకు భాస్వరం ఎరువుల వాడకం

మారుతున్న నేటి గ్రామీణ పరిస్థితుల కారణంగా, పశుసంపద రైతులకు దూరమౌతున్నది. ఫలితంగా వ్యవసాయానికి పశువుల ఎరువు అందుబాటు తగ్గిపోతున్నది. దీంతో రైతులు నేడుపూర్తిగా ఖరీదైన రసాయనిక ఎరువులుపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో, నేడు సాగుకు అధిక మొత్తంలో కాంప్లెక్స్ ఎరువులు భూములకు వాడుతున్నారు. వ్యవసాయ నిపుణులు, భాస్వరం, కలిగిన కాంప్లెక్స్ ఎరువులను దుక్కిలోనే వేయాలని సిఫారసు చేస్తున్నారు. కాని రైతులు, భాస్వరం అధికంగా కలిగిన కాంప్లెక్స్ ఎరువులను (డిఎపి 20:20:0, 10:26:26, 14:34:34 మొll) దుక్కిలోనే కాకుండా పైకుపై, పై పాటుగా వేస్తున్నారు. దీంతో భూములలో భాస్వరం నిలువలు ఎక్కువగా పేరుకపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో, భూసార పరీక్షా ఫలితాలను నిసితంగా పరిశీలిస్తే, నేడు అధిక శాతం నమూనాలలో భాస్వరం మధ్యస్థం నుంచి ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు అర్ధమౌతుంది. ముందుగానే చెప్పిన విధంగా భూములకు వేసిన భాస్వరం మొదటి 25-30 రోజుల వరకే మొక్కలకు అందుబాటులో ఉంటుంది. అటుపై, భూమిలోని భాస్వరం, మొక్కలకు అందని స్థితిలో స్థిరీకరించబడుతుంది. కాబట్టి రైతులు పెట్టే ఖర్చులో చాలావరకు వృధా అవుతుంది. మరోవైపు, భూములలో భాస్వరం ఎక్కువైనపుడు, మొక్కల ఎదుగుదలకు కీలకమైన జింకు పోషకం అందుబాటు తగ్గిపోతుంది. ఈ రకంగా రైతులకు, మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది.

భాస్వరం ఎరువులు ఖరీదైనవి

మార్కెట్లో నేడు దొరికే ప్రధాన ఎరువులలో, భాస్వరం పోషక ఎరువులు ఖరీదైనవిగా చెప్పుకోవచ్చు. దీనిని అర్థం చేసుకొనుటకు సూటి ఎరువులలో పోషకాల ధరను పట్టిక-1తో చూపడం జరిగింది.

పై పట్టిక ప్రకారం, సూటి ఎరువులలో కిలో నత్రజని రూ.12.66, భాస్వరం రూ. 62.50, పొటాష్ రూ.56.67గా ఉంది. ఈ పట్టికలోని, నత్రజని, పొటాష్ పోషకాల కిలో ధరను దృష్టిలో పెట్టుకొని, నేడు రైతులు, వాడుతున్న వివిధ కాంప్లెక్స్ ఎరువులలో, భాస్వరం పోషకం ధర లెక్కకట్టి పట్టికలో చూపడం జరిగింది. పట్టికలో చూపిన ధరలను పరిశీలిస్తే, రైతులు నేడు వాడే కాంప్లెక్స్ ఎరువులోని భాస్వరం కిలో ధర రూ.52.00 నుండి రూ.127.00 వరకు ఉంది. ఇంత ఖరిదైన ఎరువును భూములకు వాడినపుడు అందులోని 20-25 శాతం భాస్వరం పోషకాన్ని మాత్రమే మొక్కలు తీసుకుంటాయి. కాబట్టి, ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని, నిపుణులు, అధికారుల సలహా మేరకు భాస్వరం పోషకం తక్కువ ధర దొరికే ఎరువునే, సిఫారసుల మేరకు వినియోగిస్తే భూములలో భాస్వం వినియోగాని మరింత పెంచుకోవచ్చును.

భాస్వరం ఎరువుల ఉత్తమ వినియోగానికి సూచనలు

రైతులు వేస్తున్న ఖరీదైన భాస్వరం పోషక ఎరువులను, లాభసాటిగా వినియోగించుకొనేందుకు అధికారుల సూచనలను తప్పక పాటించాలి. ఈ విషయంలో ఎరువుల వ్యాపారుల ప్రమేయం లేకుంటే మంచిది. కిలో భాస్వరం పోషకం ధర తక్కువగా ఉన్న ఎరువును క్రింది జాగ్రత్తలు పాటించి, రైతులు తమ పొలాలకు వేసుకుంటే రైతులు పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితం ఉంటుంది.

  • రైతులు తమ పొలాలకు పశువుల ఎరువు లేదా పచ్చిరొట్టను అధికంగా వేసి కలియ దున్నుకోవాలి. ఇవి భూమిలో కుళ్ళేటప్పుడు విడుదలయ్యే సేంద్రియ ఆమ్లాలు, భూమిలో మొక్కలకు అందని స్థితిలో స్థిరీకరించినబడిన భాస్వరాన్ని, అందేటట్లు చేస్తాయి. సేంద్రియ ఎరువులు భూములకు అధికంగా వాడకం వలన, భూమిలోని సూక్ష్మ జీవుల వృద్ధికి అవసరమైన సేంద్రియ పదార్థం సమకూరుతుంది. ఈ సూక్ష్మ జీవులు భూమిలో మొక్కలకు అందని స్థితినిలో ఉన్న భాస్వరం పోషకాన్ని మొక్కలకు సులభంగా అందేటట్లు చేస్తాయి.
  • భూములలో అధికంగా స్థిరీకరించబడి ఉన్న భాస్వరాన్ని, మొక్కలకు, సులభంగా అందేటట్లు పాస్పో బ్యాక్టీరియా అనే జీవన ఎరువు బాగా ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్లో పి.యస్.బి. పేరుతో పొడి మరియు ద్రవ రూపంలో దొరుకుతుంది.
  • ఎకరాకు 2 కిలోలు లేదా 2 లీటర్ల ఈ జీవన ఎరువును 200 కిలోల పశువుల ఎరువు   మరియు 10 కిలోల వేపపిండితో కలిపి పొలంలో చల్లుకొంటే మంచి ఫలితాలు వస్తాయి.
  • ఆమ్ల మరియు చౌడు భూములో, భాస్వరం పోషకాని అందుబాటులోని తెచ్చేందుకు ఈ సమస్యల నివారణ చర్యలు చేపట్టాలి. ఆమ్ల భూములకు సున్నం, చౌడు భూములకు జిప్సం అధికారుల సిఫారసు మేరకు వేసుకొని, ఈ సమస్యాత్మక భూములను బాగు చేసుకోవాలి. ఈ భూములకు అధికంగా సేంద్రియ ఎరువులు వేస్తే, నేల గుల్లబారి భాస్వరం మొక్కలకు సులభంగా అందేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడుతుంది.
  • బంక నేలలు, చౌడు, ఆమ్ల భూములు, వర్షాభావ లేద బెట్ట పరిస్థితులలో మొక్కలకు భాస్వరం ఆశించనంత అందుబాటు కాదు. మరీ ముఖ్యంగా పూత, పిందె / గింజ ఎదిగే దశలో ఇది సమస్యగా మారవచ్చును. పంట కాలంలో మొదటి నుండి కాయ / పిందె ఏర్పడే దశ వరకు భాస్వరం పోషకం అవసరాన్ని గుర్తించి, నేడు ట్రిప్ ఇరిగేషన్లో నీటిలో కరిగే ఎరువులు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. భాస్వరం కలిగిన ఈ ఎరువులను వాడకం వలన పండ్లు, కూరగాయలు, ఆహార పంటల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. వీటితోబాటు నేడు ద్రవరూపంలో నాలో డిఎపిని కూడా అందుబాటులోకి వస్తున్నది. దీనిని మొక్కలపై పిచికారి చేసుకోవచ్చును. ఈ నానో డి.ఎ.పి.లోని భాస్వరం పోషకం ఆకులలోని రంధ్రాలు ద్వారా మొక్కలకు అంది మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రస్తుతం నానో డి.ఎ.పి.ని. భారత సహకార రంగ సంస్థ “ఇఫ్కో” తయారుచేసి, రైతులకు అందుబాటులోనికి తెస్తున్నది. నానో డిఎపిని ఎకరాకు 500 మి.లీ.ను 200 లీటర్ల నీటిలో కలిపి పైరుపై, పిలకలు / రెమ్మలు తొడిగే దశలో మరియు పూతకు ముందు ఒకసారి పిచికారి చేసుకోవచ్చును.

క్లుప్తంగా చెప్పాలంటే, భూములకు అందుబాటులో ఉన్న సేంద్రియ వనరులను ఎరువుగా సద్వినియోగం చేసుకొని, భూమిని ఆరోగ్యంగా ఉంచి, సిఫారసుల మేరకు మాత్రమే అనువైన రసాయన ఎరువులను వేసుకుంటే, ఖరీదైన భాస్వరం పోషకంతో పంటలలో మంచి ఫలితం వస్తాయనే వాస్తవాన్ని రైతులు గ్రహించాలి.

                                                                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow copy.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.