ప్రాథమిక కీలక ఉత్పత్తి కారకం విత్తనం
విజయవంతమైన పంట ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైన, ప్రాథమిక కీలక ఉత్పత్తి కారకం విత్తనం. అందుకే , సాగులో ఎనలేని ప్రాధాన్యత విత్తనానిది. నాణ్యమైన విత్తనం నాటితే సగం దిగుబడి సాధించినట్లే అన్నది ఆర్యోక్తి. పంటల సాగులో కూడా విత్తనం ప్రాధాన్యత ఎక్కువే. ఉత్పత్తి, ఖర్చులలో మరీ ఎక్కువ పాళ్లు తీసుకోనప్పటికీ, ఎరువులు, సాగునీరు, సస్యరక్షణ మందులు, శుద్ధి విధానాలు వంటి ఇతర ఉత్పత్తి కారకాల వాడుక సామర్థ్యం విత్తనంపైనే ఉంటుంది. నాణ్యమైన విత్తనమే సాగులో అధిక దిగుబడికి, ఆదాయం రాబడికి పునాది.
పిడిగం సైదయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, మోజెర్ల 7780509322
నాణ్యమైన విత్తనం లక్షణాలు
సిఫార్సు మేరకు భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత, మొలక సామర్థ్యం, తేమ శాతం అలాగే కలుపు విత్తనాలు, ఇతర పంటల విత్తనాలు. తెగుళ్లు సోకిన విత్తనాలు లేకుండా ఉండటం.
విత్తన రకాలు
భారత విత్తన చట్టం, 1966 ప్రకారం రైతుకు అందుబాటు విపణిలో లభించేవి రెండు రకాల విత్తనాలు. ఒకటి – ధృవీకరణ విత్తనం; రెండవది – ట్రూత్పల్లి లేబెల్డ్ విత్తనం. విత్తన చట్టం ప్రకారం దేశంలో విక్రయానికి ఉంచబడిన ప్రతి విత్తనం కచ్చితంగా లేబిల్ (విత్తన వివరాలతో కూడిన సమాచారం) ఉండాలి. ధృవీకరణ ఉన్నా లేదా లేకున్నా లేబిల్ ఖచ్చితంగా ఉండాలి.
ధ్రువీకరణ విత్తనం
ధృవీకరణకు విత్తనోత్పత్తిదారుడు విత్తన క్షేత్రాన్ని ముందుగా నమోదు చేసుకోవాలి. విత్తన ధృవీకరణ ఏజెన్సీ అధికారులు విత్తనోత్పత్తిదారుడి క్షేత్రాన్ని నిర్దేశిత సూత్రాల మేరకు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత అన్ని అంశాలలో సంతృప్తి చెందిన తర్వాత లేబిల్ మంజూరు చేయటం జరుగుతుంది.
ట్రూత్ ఫుల్ లేబుల్ విత్తనం
ట్రూత్పల్లీ లేబెల్ట్ విత్తనాల ఉత్పత్తిని ఆయా విత్తన సంస్థలే పర్యవేక్షించుకుంటాయి. ఇవి ధృవీకరణ విత్తనాలు కావు, ధృవీకరణ విత్తనాలు రాష్ట్ర లేదా కేంద్ర వంగడాల విడుదల కమిటీలు విడుదల చేసినవి అయి ఉండాలి. ధృవీకరణ విత్తనాలకు నీలి రంగు లేబిల్, ట్రూత్పల్లీ లేబెల్డ్ విత్తనాలకు ఆకుపచ్చ రంగు లేబిల్ ఉంటుంది. ఉత్పత్తి చేసిన విత్తనాన్ని పంటను బట్టి కొంత కాలం వరకు నిల్వ చేసుకొని సాగుకు వాడుకోవచ్చు.
విత్తన నిల్వ కాలం
విత్తన ఉత్పత్తి తర్వాత ఒక్కో పంటను ఒక్కో విధంగా మొలక శాతం తగ్గకుండా నిలువ చేసుకోవచ్చు.
ఉల్లిగడ్డ, క్యారట్, బెండ, మిరప, బీన్స్ రెండు సంవత్సరాలు వరకు నిల్వ ఉంటాయి. బఠాణి, పందిరి కూరగాయలు, ముల్లంగి మూడు సంవత్సరాలు, టమాట, వంగ, తర్భూజ, ఖర్బూజ, పూగోబి, క్యాబేజి
నాలుగు, ఐదు సంవత్సరాలు నిలువ చేసుకోవచ్చు.
విత్తనోత్పత్తిలో మెలకువలు
కూరగాయల పంటలలో విత్తనోత్పత్తి మిక్కిలి నైపుణ్యతతో కూడినపని. ప్రత్యేక విషయ పరిజ్ఞానం, నైపుణ్యత అవసరం. వేడి వాతావరణంలో దాదాపు అన్ని కూరగాయలలో సంతృప్తిగా, సిఫార్సుల మేరకు విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. క్యాబేజీ, ఆలస్యంగా కోతకొచ్చే పూగోబి, ఐరోపా రకపు దుంప కూరలలో విత్తనోత్పత్తి కేవలం చల్లని వాతావరణములోనే సాధ్యం. రైతులు తమ స్థాయిలో విత్తనోత్పత్తికి సంకర రకాలను ఎన్నుకోరాదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన రకాలలో మాత్రమే విత్తనోత్పత్తి చేపట్టాలి. అందుకు కావలసిన విత్తనాన్ని సంబంధిత బ్రీడరు లేదా సదరు సంస్థ లేదా అధీకృత ఏజెన్సీ నుండే పొందాలి. రశీదును భద్రపరచుకోవాలి. విత్తనోత్పత్తికి క్షేత్రంలో వేర్పాటు దూరం, మురుగు నీరు పోయే సౌకర్యాలను నిర్ధారించుకోవాలి. అప్పుడే మేలైన విత్తనోత్పత్తి సాధ్యం.
teluguraitu.com is publishing timely articles on agri and horti crops.
Thank you