విడిపూలకు సంబందించినటువంటి బంతిని మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. వేడుకల అలంకరణలోనూ, పండుగలు, పూజల సమయంలో గుళ్లను మరియు ఇంటి అలంకరణలో, పూల మాలలు తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. కోళ్ల పరిశ్రమలలో పోషకాలను అందించే దాణా తయారీలో ఉపయోగిస్తారు. పంటల సాగులో ఎరపంటగా, ఆయుర్వేద మందుల తయారీలో, కూడా బంతిని వాడుతారు. అదే విధంగా తోటలలో పూల బెడ్లలా, దారి వెంట మరింత అందంగా కనిపించటానికి బంతిని ఉపయోగిస్తారు. కీటకాలను పార ద్రోలే మందుల తయారీలో, టాజిటస్ ఆయిల్ తయారీ, పరిమళ ద్రవ్య పరిశ్రమలలో, బంతి పూలను విరివిగా ఉపయోగిస్తారు.
కత్తుల నాగరాజు (కూరగాయల శాస్రం), ఉద్యాన కళాశాల, మోజర్ల
నిమ్మల స్వరూప (ల్యాబ్ టెక్నీషియన్), ఉద్యాన కళాశాల, మోజర్ల
డా. పిడిగం సైదయ్య (జన్యు మరియు వృక్ష ప్రజనన శాస్త్రం), ఉద్యాన కళాశాల, మోజర్ల
వాణిజ్యపరంగా, విత్తనం ద్వారా సులభంగా సాగు చేయవచ్చు. మార్కెట్ డిమాండ్ ని అందుకోవడానికి అధిక మొత్తంలో సాగు చేయటానికి విత్తనం చాలా అవసరం అవుతుంది. కానీ విత్తనోత్పత్తిలో శాస్త్రీయ పరమైన అవగాహన లేకపోవడంతో విత్తనోత్పత్తి తక్కువగా ఉండటం వలన క్షేత్ర స్థాయిలో బంతిని కొంతమంది రైతులు సాగుచేయలేక పోతున్నారు. సాగులో కొన్ని మెళకువల ద్వారా శాస్త్రీయ పరమైన పద్ధతులను పాటించడం వలన అధిక మొత్తంలో, నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. నాణ్యమైన విత్తనోత్పత్తి అనేది ఉష్ణోగ్రత మరియు ఋతువుల మీద ఆధారపడి ఉంటుంది. శీతాకాల పంట ద్వారా నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు.
అనువైన నేలలు :-
బంతిని ఎలాంటి నేలలో అయినా సాగు చేసుకోవచ్చు కానీ నేల ఉదజని సూచిక 7-7.5 ఉండే నేలలు, సారవంతమైన, మురుగు నీరు పోయే సౌకర్యం గల ఎర్ర గరప నేలలు, మరియు ఇసుక ఒండ్రు నేలలు అత్యంత అనుకూలమైనవి.
వాతావరణం :-
సంవత్సరం పొడవునా మార్కెట్ డిమాండ్ కి అనుగుణంగా రైతులు సాగు చేస్తున్నప్పటికీ, విత్తనోత్పత్తి కొరకు నాణ్యమైన విత్తనాన్ని పొందటానికి శీతాకాల పంటగా సాగు చేసుకోవడం మంచిది. శాఖీయ పెరుగుదల 14.5oC- 28.6oC వద్ద మరియు పూలదిగుబడి 26.2oc – 36.4oc- ఉష్ణోగ్రత వద్ద ఎక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద మొక్క పెరుగుదల తగ్గి, తక్కువ పరిమాణం గల పూలు రావటం వలన దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యమైన విత్తనాన్ని పొందలేము. కావున విత్తనోత్పత్తికి శీతాకాల పంట ఎంతో కీలకం.
సాగు స్థలం ఎంపిక :-
సూర్యరశ్మి బాగా తగిలే ప్రాంతంలో సాగు చేసుకోవాలి. కాంతి సరిగా లేనటువంటి ప్రాంతంలో మొక్క శాఖీయ దశలో ఉండిపోతుంది.
రకాలు :-
ఆఫ్రికన్ బంతి లో జైంట్ డబుల్ ఆఫ్రికన్ ఆరెంజ్, జైంట్ డబుల్ ఆఫ్రికన్ ఎల్లో, క్రాకల్ జాక్, మొ॥ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నవి. ఫ్రెంచ్ బంతిలో రెడ్ బ్రాకేడ్, రస్టీరెడ్, బట్టర్ స్కాచ్ రకాలు ఎక్కువ డిమాండ్ ఉన్నవి.
నారు పెంపకం :–
బంతిలో విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఒక హెక్టారుకి 2- 2.5 kg ల విత్తనం అవసరం అవుతుంది. 1 గ్రా. లో 300 విత్తనాలు ఉంటాయి. విత్తనోత్పత్తికి శీతాకాల పంట సాగు అనువైనది కావున ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో విత్తనాన్ని విత్తుకోవాలి. నారును పెంచడానికి 1 మీ. వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు ఉండి తగినంత పొడవగా ఉన్నటువంటి బెడ్లను, ఎర్రమట్టి, బాగా చివికిన పశువుల ఎరువును సమపాళలో కలిపి తయారు చేసుకోవాలి. విత్తనాన్ని పెట్టే ముందు బెడ్ మీద ఫాలిడాల్ పొడిని పలుచగా చల్లుకోవాలి. దీనివలన విత్తనాన్ని చీమల బెడద నుండి రక్షించుకోవచ్చు. విత్తిన తరువాత పైపాటుగా పశువుల ఎరువును పలుచగా చల్లుకొని, నీటి తడిని ఇవ్వాలి. శీతాకాలంలో మొలక త్వరగా రావడానికి నారుమడిని ఎండు గడ్డితో కప్పి ఉంచాలి. మొలకలు కనిపించిన తరువాత గడ్డికి తీసివేయాలి. విత్తనాన్ని ట్రేలలో నాటినట్లయితే బలమైన నారు మొక్కలను పొందవచ్చు.
ప్రధాన పొలంలో నాటడం :-
ఆరబెట్టిన విత్తనాన్ని ఒక పేపర్ బ్యాగులో లేదా మస్లిన్ క్లాత్ లో నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయకూడదు. ఎందుకనగా ఏమైనా తేమ ఉన్నట్లయితే ఆరనివ్వనుండా చేస్తుంది తద్వారా విత్తనం కుళ్ళి పోవటానికి దారితీస్తుంది. బ్యాగులలో నింపిన తరువాత లేబుల్ చేసుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ రకాలు ఉన్నట్లయితే వేర్వేరు సంచులలో నిల్వ చేసుకోవాలి. సంచులను చల్లని మరియు పొడి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశాలలో నిల్వ చేసుకుని పెట్టుకోవాలి.
బంతిని అన్ని కాలాల్లో సాగు చేస్తున్నప్పటికి ఒక నెల తేడాతో జులై మొదటి వారం నుండి మార్చ్ మొదటి వారం వరకు నాటుకుంటే మార్కెట్ కు అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు పువ్వులను సరఫరా చేయవచ్చు. ఎక్కువగా పండుగ సీజన్లలో వచ్చేటట్టు మొక్కలను నాటుకుంటే రైతులు ఎక్కువ లబ్ది పొందుతారు. మార్కెట్లో డిమాండ్ ని బట్టి 60 రోజుల ముందు నాటుకోవాలి. విత్తనోత్పత్తి కోసం సెప్టెంబర్ రెండవ పక్షంలో నారును ప్రధాన పొలంలో నాటు- కున్నట్లయితీ పంట నుండి మంచి నాణ్యమైన పువ్వులను పొందడంతో పాటు నాణ్యమైన విత్తనాన్ని కూడా పొందవచ్చు. 25 రోజుల వయస్సున్న, 3-4 ఆకులు కలిగిన దృడమైన మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందు ఒక రోజు నారు మడికి నీటిని అందించాలి. నీటిని అందించడం వలన మొక్కలను తీసేటప్పుడు వేరు భాగం దెబ్బతినకుండా ఉంటుంది.
మొక్కకు మొక్కకు మద్య దూరం :-
నాణ్యమైన విత్తనాన్ని పొందటానికి మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆఫ్రికన్ బంతి రకాలకైతే ఒకే వరుసలోని మొక్కల మధ్య 30 సెం.మీ దూరం మరియు రెండు వరుసల మధ్య మొక్కల మధ్య దూరం 40-60 సెం.మీ ఉండేలా నాటుకోవాలి. ఫ్రెంచ్ బంతిలో ఒకే వరుసలోని మొక్కల మధ్య 15-20 సెం. మీ మరియు రెండు వరుసల మధ్య మొక్కలకి 20 సెం.మీ దూరం తో నాటుకోవాలి.
ఏర్పాటు దూరం :–
కల్తీలేని నాణ్యమైన విత్తనాన్ని పొందటానికి, ఒకే రకమైన మరో పంట ఇతర రకాలు మరియు శిలీంధ్రాల బారినపడ్డ మొక్కల నుండి కనీస ఏర్పాటు దూరం పాటించాలి. పునాది విత్తనానికి 600 మీ, మరియు ధృవీకరణ విత్తనానికి 300 మీ॥ కనీస ఏర్పాటు దూరాన్ని పాటించాలి.
ఎరువుల యాజమాన్యం :-
ప్రధాన పొలం తయారుచేసేటప్పుడు ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. వీటితో పాటుగా ఒక ఎకరానికి 30 కి॥ల నత్రజని 30 కి॥ల భాస్వరం మరియు 30 కి॥ల పోటాష్ ను అందించే ఎరువులను అనగా 66 కి॥ల యూరియా, 185 కి॥ల సింగిల్ సూపర్- ఫాస్ఫేట్, 50 కి॥ల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ను అందించాలి. సిఫారసు చేసిన మొత్తంలో సగం నత్రజనిని, మొత్తం ఫాస్ఫేట్, పొటాష్ ను ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. మిగతా సగం నత్రజనిని మొక్కలను నాటిన 30-40 రోజుల తరువాత పై పాటుగా అందించాలి.
నీటి యాజమాన్యం:-
నాణ్యమైన విత్తన దిగుబడిని పొందటానికి నీటి ఎద్దడి లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో నీటిని అందించాలి. శాఖీయ దశలోనూ, పూత దశలోనూ నేల తడి చాలా ముఖ్యం. ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైనట్లయితే మొక్క పెరుగుదల మరియు పూత దెబ్బతింటుంది. ఇసుక నేలలో మరియు వేసవి కాలంలో నీటిని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. శీతాకాల పంటకు వారం రోజులకు ఒకసారి నీటిని అందించాలి.
పువ్వు మొగ్గను త్రుంచటం:-
మొక్కలు ప్రధాన పొలంలో నాటిన 40 రోజుల తరువాత శాఖీయ దశలో ఉన్నప్పుడు ఎక్కువ శాఖలను పొందటానికి ప్రధాన కాండంలో ఉన్న శిఖరాగ్ర మొగ్గను తుంచి వేయాలి.
కలుపు నివారణ:-
విత్తనోత్పత్తి సాగు కావున కలుపు ఉన్నట్లయితే, కలుపు విత్తనాలు బంతిలో కలిసి అవకాశం ఉంటుంది కాబట్టి నాణ్యమైన విత్తనాన్ని పొందటానికి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. ప్రధానంగా పూల దశలో కలుపు లేకుండా చూసుకోవాలి.
రోగింగ్ (కల్తీల ఏరివేత) :-
బంతి మొక్కలు కాకుండా వేరే మొక్కలు ఉన్నా లేక ఆరోగ్యంగా లేని బంతి మొక్కలైనా, ప్రధాన దశలలో గమనిస్తూ తీసివేయాలి.
పూల కోత :-
పూలకోత అనేది విత్తనోత్పత్తిలో చాలా ముఖ్యమైన దశ. ఈ దశలో పూర్తిగా ఎండినటువంటి పూలను సేకరించుకోవాలి. రక్షణ పత్రాలు కొద్దిపాటి ఆకుపచ్చరంగులో ఉన్నా పర్వాలేదు. పూర్తిగా ఎండిపోయేంతవరకు వేచి ఉన్నా కూడా ఎవ్వులు కుళ్లిపోవడం లేదా రాలిపోవడం జరుగుతుంది. దీని వలన నాణ్యమైన విత్తన దిగుబడి తగ్గిపోతుంది. కోత అనంతరం, పూలను 2-3 రోజుల వరకు నీడలో ఆరబెట్టుకోవాలి.
పూల నుండి గింజలను వేరు చేయట :-
బాగా ఆరబెట్టిన పూలను నేలపై పరిచిన క్లాత్ మీద వేసి కర్రతో నెమ్మదిగా గింజలు విరిగిపోతుండా కొట్టాలి. లేదా రక్షక పత్రాల నుండి ఆకర్షక పత్రాలను గింజతో సహా వచ్చేలాగా వేరు చేసుకోవాలి. తరువాత ఆకర్షక పత్రాలను విత్తనం నుండి వేరు చేయాలి. బంతి విత్తనాలు పొడవుగా, సన్నగా, మొనలాగా ఉంటాయి. ఒక వైపు నల్లగా మరొకవైపు తెల్లగా ఉంటాయి. విత్తానాలను వేరు చేసిన తరువాత వేరే పూల బాగాలను అంటే ఎలాంటి చెత్త లేకుండా శుభ్రం చేయటానికి గాలికి తూర్పార పట్టుకోవాలి.
విత్తనాన్ని ఆరబెట్టుట :-
సేకరించిన విత్తనాన్ని పరిచిన క్లాత్ పై వేసి గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో ఒక వారం రోజుల వరకు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా చేయటం వలన విత్తనం కుళ్లిపోకుండా శిలీంధ్రాలు ఆశించకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
విత్తన పంట :-
ఆఫ్రికన్ బంతి ఒక ఎకరానికి 120-150 కి॥ల విత్తనం మరియు ఫ్రెంచ్ బంతి అయితే ఒక ఎకరానికి 400 – 500 కిll ల విత్తన పంటను పొందవచ్చు.
విత్తన ప్రమాణాలు:-
నాణ్యమైన విత్తనానికి క్రింద సూచించిన విత్తన ప్రమాణాలు కలిగి ఉండాలి.
అంశాలు | ప్రమాణాలు | |
పునాది విత్తనం | దృవీకరణ విత్తనం | |
1. శుద్ద విత్తనం (కనిష్టంగా) | 98 శాతం | 98 శాతం |
2. జడ పదార్థం (గరిష్టంగా) | 2 శాతం | 2 శాతం |
3. ఇతర పంట విత్తనాలు (గరిష్టంగా) | 0 | 0 |
4. కలుపు విత్తనాలు (గరిష్టంగా) | 0 | 0 |
5. మొలక శాతం (కనిష్టంగా) | 70 శాతం | 70.0 శాతం |
6. ఇతర రకాల విత్తనాలు (గరిష్టంగా) | 5 / కిలో విత్తనం | 10 / కిలో విత్తనం |
7. తేమ (గరిష్టంగా) | 8.0 శాతం | 8.0 శాతం |
8. తేమ చొరని కంటైనర్లలో | 5.0 శాతం | 5.0 శాతం |
SUPERB