మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పెరగడానికి తగినంత పోషణ అవసరముంటుంది. మొక్కలు పెరగడానికి 18 పోషకాలు తప్పనిసరిగా అవసరంమౌతాయి. వీటిలో కార్బన్ ను గాలి నుండి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ను నీటి నుండి తీసుకుంటాయి. మిగిలిన 15 పోషకాలను మొక్కలు భూమి నుండి గ్రహిస్తాయి. మొక్కలు పెరగడానికి వివిధ పోషకాలను తీసుకునే పరిమాణాన్ని బట్టి పోషకాలను మూడు రకాలుగా విభజించారు. అధిక మొత్తంలో అవసరమయ్యే నత్రజని, భాస్వరం, పొటాషియం పోషకాలను ప్రధాన పోషకాలని అంటారు. ఒక మోస్తరు పరిమాణంలో అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం మరియు గంధకంను ఉపపోషకాలని చెపుతారు. మొక్కలకు అతి తక్కువ పరిమాణంలో కావల్సిన జింకు, ఇనుము, రాగి, మాంగనీసు, బోరాన్, మాలిల్జీనం, క్లోరిన్, నికెల్, కోబాల్ట్ పోషకాలను సూక్ష్మపోషకాలుగా చెప్పబడుతుంది.

మెరుగు భాస్కరయ్య, ఎడిఎ,  వ్యవసాయశాఖ జిల్లా వనరుల కేంద్రం, తిరుపతి-517 503, (ఆ.ప్ర.)

మొక్కలు తీసుకొనే పోషకాల పరిమాణాన్ని బట్టి వాటి ప్రాధాన్యత, పనితనంలోనూ తేడాలు ఉండవు. మొక్కల పెరుగుదలకు ప్రతి పోషకం ముఖ్యమైనవే. ప్రతి పోషకం మొక్క పెరుగుదలలో ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుంది. ఒక పోషకం చేసే పనిని మరొక పోషకం చేయదు. ఒక పోషకం లోపిస్తే, అది చేసే పని మొక్కలో కుంటుబడుతుంది. అలాగని ఒక పోషక లోపాన్ని మరొక పోషకంతో సర్దుబాటు చేయడానికి వీలుకాదు. కాబట్టి మొక్కల పెరుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు అవసరమైన పరిమాణంలో అందినపుడే అవి ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను ఇవ్వగలవు.

ప్రస్తుతం రైతులు పంటల సాగులో నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలు కలిగిన ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. సూక్ష్మ పోషక ఎరువుల వాడకానికి రైతులు పెద్దగా ముందుకు రావడం లేదు. దీంతో భూముల సూక్ష్మ పోషకాలు అందుబాటు తగ్గినపుడు మ్కొలలో వీటి లోపాలు కన్పిస్తాయి. అంటే సూక్ష్మ పోషకాలు మొక్కల జీవ క్రియలో చేసే పనులకు ఆటంకం ఏర్పడుతుందన్న మాట. ఫలితంగా పంట మొక్కలు అధిక దిగుబడినిచ్చే సామర్ధ్యాన్ని కోల్పోతాయి. కాబట్టి ప్రధాన పోషకాలు కలిగిన ఎరువులు ఎంత మోతాదులో వేసినా దిగుబడులు పెరగక స్థబ్దత నెలకొంటున్నది. దీన్నిబట్టి రైతులు పంటలు అధిక దిగుబడులు ఇవ్వడానికి సూక్ష్మపోషకాల ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి.

మొక్కల పెరుగుదలలో సూక్ష్మపోషకాల పాత్ర

సూక్ష్మ పోషకాలు మొక్కలకు అతి తక్కువ మోతాదులలో అవసరమైనప్పటికి, మొక్కలలో జరిగే అనేక జీవక్రియలలో ప్రముఖ పాత్రపోషిస్తాయి. మొక్కల పెరుగుదలకు అవసరమైన హర్మోనులు, ఎంజైముల తయారీకి తోడ్పడుతుంది. ఆకులలో పత్రహరితాన్ని ఉత్పత్తి చేయడంలో, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారోత్పత్తి చేయడంలో దోహదపడుతాయి. మొక్కలలో తయారైన ఆహారాన్ని వినియోగించే శ్వాసక్రియలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఉధ్యాన పంటల్లో, పలదీకరణకు పిందె కట్టుటకు, మరియు పంట నాణ్యంగా పక్వానికి రావడానికి ఉ పయోగపడతాయి. కాబట్టి మొక్కలలో సూక్ష్మపోషకాలు లోపించినపుడు, మొక్కలలో జరిగే జీవన క్రియలన్నీ కుంటుబడుతాయి. కాబట్టి దీని ప్రభావం మొక్కల పెరుగుదల మరియు పంట దిగుబడులపై తప్పక ఉంటుంది. కాని నేడు చాలమంది రైతులలో సాగులో సూక్ష్మపోషకాల ప్రాధాన్యతపై తగినంత అవగాహన లేదు. కాబట్టి అధిక దిగుబడులకు సాయపడే సూక్ష్మపోషకాల వాడకాన్ని విస్మరిస్తున్నారు. దీని వలన దేశంలో అన్ని ప్రాంతాలలో అనేక సూక్ష్మ పోషక లోపాలు నేడు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

పంటల్లో సూక్ష్మపోషక లోప లక్షణాలు

సూక్ష్మపోషక లోపాలు సాధారణంగా ఆకులపైన మరియు కాయలపైన కన్పిస్తాయి. కొన్ని సందర్భాలలో పంట మొక్కలలో ఎలాంటి లక్షణాలు కన్పించకనే సూక్ష్మపోషక లోపాలు పంట దిగుబడులపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి పంటల్లో, లోప లక్షణాలు కన్పించకపోయినా, సూక్ష్మపోషకాలను భూమిలో వేసినపుడు దిగుబడులు పెరగడం గమనించడం జరిగింది.

జింకు : జింకు మొక్కలలో జరిగే అనేక జీవక్రియలలో కీలకంగా పనిచేస్తుంది. జింకు లోపం 50 శాతం వరకు ఎలాంటి లోప లక్షణాలు లేకుండానే పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది. లోప లక్షణాలు ఎక్కువగా ఆకుల పైనే కన్పిస్తాయి. లేత ఆకులలో ఈ నెల మధ్య భాగం పసుపు రంగుకు మారుతుంది. ఆకుల చివరలో ఈనెలకు ఇరువైపుల తుప్పు రంగు మచ్చలు కన్పిస్తాయి. ఆకులు చిన్న చిన్నవిగా మారి గుబురుగ కన్పిస్తాయి. వేర్ల అభివృద్ధి సరిగా ఉండదు. మొక్కలలో ఎదుగుదల మందిస్తుంది. పూత ఆలస్యమౌతుంది. ఆకుల ముందు గానే రాలిపోతాయి, మొక్కలు గిడసబారుతాయి.

ఇనుము : ఇనుము మొక్కల ఆకుల్లో పత్రహరితం తయారికీ, కిరణజన్య సంయోగ క్రియలో, ఎంజైముల తయారీలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇనుము లోపించిన మొక్కలలోని లేత ఆకులలో మొదటి ఈనెల మధ్య భాగాలు పాలిపోయి, తెల్లగా మారి కొనలు ఎండిపోతాయి. చెఱకు, నీటి పారుదల క్రిందసాగయ్యే వేరుశనగ, చీనీ-నిమ్మ పంటలలో ఇనుము లోపం ఎక్కువగా కన్పిస్తుంది.

బోరాను: మొక్కలలో జరిగే అన్ని జీవక్రియలలో బోరాను ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మొక్కలలో పూత బాగా రావడానికి, ఫలదీకరణ బాగా జరగడానికి, పిందె కట్టడానికి, బోరాను ఉ పయోగపడుతుంది. చెట్లు బెట్ట పరిస్థితిని తట్టుకొనేటట్లు సాయపడుతుంది. బోరాను లోపించినపుడు లేత చిగుర్లు మెలి తిరిగి చనిపోతాయి. వేర్లు సరిగా అభివృద్ధి చెందవు. కాయలలో పగుళ్ళు రావడం, కాయలపై బుడిపలు రావడం లేదా ఆకారం సరిగా లేకపోవడం జరుగుతుంది.

మాంగనీసు: మాంగనీసు కూడా పత్రహరితం తయారిలో, కిరణజన్యసంయోగ క్రియలో పాలుపంచుకుంటుంది. మాంగనీసు లోపం లేత ఆకులలో కన్పిస్తుంది. మాంగనీసు లోపం మొదట ఆకులలో ఇనుము లోపమును పోలి ఉంటుంది. ఆకుల ఈనెల మధ్య భాగం పసుపురంగుకు మారుతుంది. కాని ఈనెల దగ్గర భాగం మాత్రం ఆకుపచ్చగానే ఉంటుంది. ఆకులు కిందికి ముడుచుకొని ఉంటాయి.

పైన చర్చించిన సూక్ష్మ పోషక లోపాలు తెలుగు రాష్ట్రాలలో సాధారణంగా కన్పించేవి. వీటి లోపలక్షణాలను పరిశీలిస్తే, ఆకులు చిన్నవిగా మారడం, ఆకు పచ్చరంగు కోల్పోయి, పసుపు పచ్చరంగుకు మారడం, ఎక్కువగా కన్పిస్తున్నది. అంటే మొక్కలలో పత్రహరితం తగ్గి కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలలో ఆహార ఉత్పత్తి సన్నగిల్లుతుందన్నమాట. ఫలితంగా మొక్కలు బలహీనపడి, ఆశించిన దిగుబడులను ఇవ్వలేక పోతాయనే విషయం స్పష్టమౌతున్నది.

సూక్ష్మపోషక లోపాలు రావడాని అనుకూల పరిస్థితులు

  • రైతులు పంటలలో అధిక దిగుబడులు సాధించుటకు అధిక మొత్తంలో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వాడుతుంటారు. మొక్కలు ఈ ఎరువులకు అనుగుణంగా అదే దామాషాలలో భూమి నుండి అవసరమైన మేరకు సూక్ష్మ పోషకాలను తీసుకొనుటకు ప్రయత్నిస్తాయి. కాని రైతులు ప్రధాన పోషక ఎరువుల వినియోగించే విధంగా సూక్ష్మపోషక ఎరువులను వాడక పోవడం వలన వీటిలోపాలు ఎక్కువగా కన్పిస్తాయి.
  • సున్నం అధికంగా గల భూములలో మరియు చౌడు వరుస అధికంగా గల భూములలో సూక్ష్మ పోషకాల అందుబాటు తక్కువగా ఉంటుంది.
  • సేంద్రియ పదార్థం తక్కువ గల భూముల్లో సూక్ష్మ పోషక లోపాలు అధికంగా ఉంటాయి. అయితే మాంగనీసు మాత్రం సేంద్రియ పదార్థం అధికంగా గల భూముల్లో తక్కువ లభ్యమౌతుంది.
  • ఇసుక వరుస కలిగిన తేలిక భూముల్లో కూడా సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కన్పిస్తుంది.
  • భాస్వరం అధికంగా గల భూముల్లో జింకు మరియు ఇనుము పోషకాల అందుబాటు తక్కువగా ఉంటుంది.
  • అధిక మొత్తంలో నత్రజని ఎరువులు వాడే భూముల్లో కూడా జింకు లోపం అధికంగా ఉంటుంది.
  • చలి ఎక్కువగా ఉండి, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే కాలంలో జింకు అందుబాటు తక్కువగా ఉంటుంది.

సూక్ష్మపోషక ఎరువులు

పంట లేదా పంట పొలాలకు సుం షేకాలను క్రింది విధంగా ‘ పంచవచ్చును.

1. సేంద్రియ ఎరువులు

రైతులు సాధారణంగా పొలాలకు వినియోగించే పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువులలో తక్కువ పరిమాణంలో సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉంటాయి. అందుకే, గతంలో సంవృద్ధిగా సేంద్రియ ఎరువులు ఉపయోగించి సాగు చేసినపుడు సూక్ష్మ పోషక లోపాలు కన్పించలేదు. చెఱువులలో వండ్రుమట్టిని పొలాలకు వేయడం వలన తక్కువ మోతాదులలో సూక్ష్మపోషకాలు భూమిలో అందుబాటులోనికి వస్తాయి. పచ్చిరొట్ట మరియు పచ్చి ఆకు ఎరువును విరివిగా వినియోగించడం వలన కూడా భూములకు కొంత వరకు సూక్ష్మ పోషకాలు అందుబాటులోనికి వస్తాయి.

2. లవణాలు రూపంలో సూక్ష్మపోషక ఎరువులు

సూక్ష్మ పోషక లోపాలు గుర్తించినపుడు క్రింది లవణాల రూపంలో గల సూక్ష్మపోషక ఎరువులను నేలకు వేసుకొని లేదా పైరు పై పిచికారి చేసుకొని లోపాలను నివారించవచ్చును.

లవణ రూపంలోని సూక్ష్మపోషక ఎరువులను భూములకు వేసినపుడు, అందులో కొంత భాగం పోషకం బిగుసుకుపోయి, వృధా అయ్యే అవకాశముంది.

3. చీలేటెడ్ రూపంలో సూక్ష్మపోషక ఎరువులు

చీలేట్లను ఈడిటిఎ (ఎథిలిన్ డై అమైన్ టెట్రా అసిటిక్ ఆసిడ్) రసాయనంతో కలిపి తయారు చేస్తారు. జింకు, ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మ పోషకాలు చీలేట్ల రూపంలో లభిస్తున్నాయి. చీలేట్ల రూపంలో సూక్ష్మ పోషకాలను నేలకు వేసినపుడు ఎలాంటి మార్పులు చెందక వృధా కాకుండా మొక్కలకు బాగా ఉపయోగపడుతాయి. వీటిని అన్ని ప్రధాన పోషకాల ఎరువులతో కలిపి వాడవచ్చును.

పై చీలెటెడ్ సూక్ష్మపోషక ఎరువులను భూమిలో వేయుటకు గాని లేదా ఆకులపై పిచికారి చేయుటకు గాని వినియోగించుకోవచ్చును. డ్రిప్ ద్వారా అందించుటకు అనుకూలంగా ఉంటాయి.

చీలేటెడ్ సూక్ష్మపోషక ఎరువుల ధర కాస్తా ఎక్కువగా ఉన్నప్పటికీ, తక్కువ మోతాదులలోనే మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి రైతుకు లాభదాయకంగానే ఉంటుంది.

సూక్ష్మపోషక మిశ్రమాలు

వివిధ పంటలలో సూక్ష్మపోషకాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచన మేరకు కొన్ని సూక్ష్మ పోషకాల మిశ్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పండ్ల తోటలకు, కూరగాయలకు, వరి, నూనె గింజల పంటల మొదలైన వాటికి ఇవి అందుబాటులో ఉన్నాయి.

పైన తెలిపిన మిశ్రమాలలో ఫార్ములా-7 ను మాత్రం భూమిలో వేసుకోవాలి. మిగిలినవన్నీ మొక్కలపైన నీటిలో కలిపి పిచికారి చేయాలి.

భారత ఉధ్యాన పరిశోధనా సంస్థ (IIHR) బెంగుళూరు వారు రూపొందించిన సూక్ష్మపోషక

మిశ్రమాలు:

సూక్ష్మ పోషకాల సమగ్ర యాజమాన్యం

రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతూ, సేంద్రియ ఎరువులను తగ్గించి సేద్యం చేయడం వలననే, నేడు సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కన్పిస్తున్నవి. పంట పొలాలకు పశు వుల ఎరువు, కోళ్ళ ఎరువు, పచ్చిరొట్ట, నూనెగింజల పిండి వంటి సేంద్రియ ఎరువులు విరివిగా వాడడం వలన సహజంగానే సూక్ష్మ పోషక లోపాలను నివారించవచ్చును. వీటి అందుబాటు తక్కువగా ఉన్నపుడు సిపారసుల మేరకు రసాయనిక సూక్ష్మ పోషక ఎరువులను వాడాలి. భూములో రసాయనిక ఎరువులతో పాటు అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులను కూడా కలిపి వాడితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక సూక్ష్మపోషకాల లోప నివారణ కొస్తే.

జింకు:

జింకు లోపం నేడు అన్ని ప్రాంతాలలో, అన్ని పంటలపై సాధారణంగా కన్పిస్తున్నది. నీటి పారుదల సౌకర్యంతో సాగు చేసే వరి మరియు ఆధునిక పద్ధతులతో సాగు చేసే ఉధ్యాన పంటలకు ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటు (21 శాతం) మూడు పంటలకు ఒకసారి సిఫారసు చేయడం జరిగింది. వేరుశనగ వంటి ఆరుతడి పైర్లకు మరియు వర్షాధార పంటలకు ఎకరాకు 10 కిలోల జింకు సల్ఫేటు దుక్కిలో వేసుకుంటే సరిపోతుంది. పంటలపై జింకు లోపం కన్పిస్తే లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటున కలిపి 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి. జింకు సల్ఫేటును భాస్వరం కలిగిన ఎరువులతో గాని లేదా కాంప్లెక్స్ ఎరువులతో గానీ కలిపి వాడరాదు. వీటిని కలిపి వాడినపుడు జరిగే రసాయనిక చర్యల వలన రెండు పోషకాలు మొక్కలకు అందకుండా పోతాయి. జింకును పైరు పై పిచికారి చేసే కంటే భూమిలో వేసుకోవడం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయి. చీలేటెడ్ రూపంలో జింకును భూమిలో వేసుకొనుటకు 500గ్రా. సరిపోతుంది. మొక్కలపై పిచికారి చేయుటకు లీటరు నీటికి 1-1.5 గ్రా. సరిపోతుంది. భూమిలో వేయుటకు వరి పంటకు ఫార్ములా-7 పోషక మిశ్రమాన్ని ఎకరాకు 10 కిలోలు వాడుకుంటే సరిపోతుంది. జింకు లోపం ఉన్న భూమిలకు కోళ్ళ, ఎరువు వాడడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.

ఇనుము

ఇనుము లోపం ఎక్కువగా చెఱకు, వేరుశెనగ, పండ్లు, కూరగాయల పంటల్లో కన్పిస్తుంటుంది. ఇనుము లోపించిన భూములకు ఎకరాకు 20 కిలోల పెర్రస్ సల్పేటు (అన్నభేది) నేలలో వేసి కలియ దున్నుటకు సిఫారసు చేస్తారు. కాని ఇనుము లోప నివారణకు, ఎరువును భూమిలో వేయుట కంటే పైరు పై పిచికారీ చేయడం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయి. పిచికారి చేయడం ద్వారా ఖర్చు ఆదా కావడమే కాకుండా, లోప లక్షణాలను త్వరగా నివారించవచ్చును. పైరు పై పిచికారి చేయుటకు 5 గ్రా. ఫెర్రెస్ సల్ఫేటు మరియు 0.5 గ్రా. నిమ్మ ఉప్పు లేదా నిమ్మరసం లీటరు నీటికి చొప్పున కలుపుకోవాలి. వారం, పది రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేస్తే మంచి ఫలితముంటుంది. చీలేటెడ్ రూపంలో ఇనుమును పిచికారి చేయుటకు లీటరు నీటికి 1-1.5 గ్రా. కలుపుకొంటే సరిపోతుంది.

బోరాను

బోరాను లోపం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, వేరుశనగ, కొబ్బరి వంటి పంటలో అధికంగా కన్పిస్తుంది. పంటల్లో బోరాను లోప నివారణకు ఎకరాకు 2-4 కిలోల బోరాక్స్ ను భూమిలో వేసుకోవచ్చును. లేదా బోరిక్ ఆమ్లం లేదా సాల్యుబోర్ ను లీటరు నీటికి 2 గ్రా. చొప్పున కలిపి పంటపై పిచికారి చేయవచ్చును. బోరాను సూక్ష్మపోషకాన్ని పురుగు మందులతో గాని లేదా ఇతర సూక్ష్మపోషకాలతో గాని కలిపి వాడుకోవచ్చును. బోరాను సిఫారసుకు మించి భూమిలో వాడితే, అది మొక్కలకు హానికరంగా మారుతుంది.

మాంగనీసు

ప్రస్తుత కాలంలో మాంగనీసు లోపం పండ్లు, కూరగాయలు వంటి ఉద్యాన పంటల్లో జరుగుతున్నది. మాంగనీసు లోపమున్న భూములకు ఎకరాకు 10 మాంగనీసు సల్ఫేటును సిఫారసు చేయడం జరిగింది. లేకుంటే లోప లక్షణాలు కన్పించినపుడు ఆ లీటరు నీటికి 5 గ్రా. మాంగనీసు సల్ఫేటును కలిపి 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్ల పిచికారి చేయాలి. చీలేటెడ్ మాంగనీసును లీటరు నీటికి 3.5గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయవచ్చును.

భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా, సూక్ష్మ పోషక లోపాలను బట్టి పైన తెలిపిన విధంగా లోప నివారణకు చర్యలు చేపట్టవచ్చును కాని చాలా సందర్భాలలో మొక్కలలో సూక్ష్మపోషక లోప లక్షణాలు స్పష్టంగా కల్పించక, పూత, పిందె రాలడం మరియు పంట దిగుబడులు తగ్గుతుంటాయి. ఈ పరిస్థితులు ప్రస్తుతం ఎక్కువగా పండ్లు, కూరగాయ పంటలలో కన్పిస్తున్నది. ఈ పరిస్థితితులను సవరించుటకు సూక్ష్మపోషకాల మిశ్రమాల వినియోగం మంచి ఫలితాలను ఇస్తున్నది. కూరగాయలు, పండ్ల పంటల్లో, పూతకు ముందు మరియు పిందె ఏర్పడి, వృద్ధి చెందే దశలో ఈ మిశ్రమాల వినియోగం మంచి ఫలితాలను ఇస్తున్నది. ఫార్ములా-4 మిశ్రమాన్ని లీటరు నీటికి 2-3 గ్రా. చొప్పున పిచికారీ చేయవచ్చును. మామిడి, అరటి, చీని నిమ్మలో ‘భారత ఉధ్యాన పరిశోధనా సంస్థ వారు రూపొందించిన అర్క సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని’ లీటరు నీటికి 5 గ్రా. చొప్పున 2-3 సార్లు పిచికారీ చేయవచ్చును. కూరగాయ పంటలలో “అర్క వెజిటబుల్ స్పెషల్”ను లీటరు నీటికి 2-5 గ్రా. చొప్పున కలిపి వాడవచ్చును. ఈ సూక్ష్మ పోషక మిశ్రమాలను పై పంటల్లో సూక్ష్మ పోషక లోపాలను పరిగణలోనికి తీసుకోకుండా సిఫార్సుల మేరకు పిచికారీ చేసినా మంచి ఫలితాలు వస్తున్నవి. పండ్లు, కూరగాయ పంటల్లో అధికంగా పూత రావడం, పిందె కట్టడం, పిందెలు రాలుట తగ్గడం, కూరగాయల నాణ్యత పెరగడం వంటి మంచి ఫలితాలు దీనివలన గమనించడం జరిగింది.

డ్రిప్ పద్ధతిలో పర్టిగేషన్ ద్వారా సూక్ష్మపోషకాలను అందించేటప్పుడు, పంట, నేల రకాన్ని బట్టి సిఫార్సుల ప్రకారం షెడ్యూలును తప్పక పాటించాలి. ఈ విషయంలో అధికారిక సిఫారసులకే రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంలో ఎరువులు అమ్మె వ్యాపారం ప్రమేయం లేకుంటేనే మంచిది.

పంట మొక్కలకు సూక్ష్మపోషకాల అవసరం అల్పంగా ఉన్నా పంట దిగుబడులపై ప్రభావం మాత్రం అధికం ఉంటుంది. కాబట్టి వీటి ఉత్తమ యాజమాన్యం కోసం, సిఫార్సుల మేరకు రసాయనిక ఎరువులతో పాటు తప్పకుండా విరివిగా సేంద్రియ ఎరువుల వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంతోనే పంటల్లో సూక్ష్మపోషక లోపాలు లేకుండా అధిక దిగుబడులను పొందుటకు వీలుంటుంది.

                                      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow copy.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.