అత్యంత విలువైన పోషకాలు మునగ సొంతం. మునగ కాయలు, ఆకులు, పూల కోసం ఈ పంట దేశం, రాష్ట్రంలో సాగు చేయబడుతున్నది. విత్తన జిగురు, నూనె విత్తనాలు వివిధ ఔషధ పరిశ్రమలలో వాడుతారు. కేవలం 20 గ్రాముల మునగ ఆకులు ఏ, సీ విటమిన్లను అందిస్తాయి. 100 గ్రాములు ఉడకబెట్టిన ఆకులతో వ్యక్తికి రోజూ కావలసిన కాల్షియం, 75 శాతం ఇనుము, సగం ప్రోటీన్, ఇతర అమైనో ఆమ్లాలు అందిస్తాయి. అందుకే కూరగాయ పంటగా మునగకు ఆదరణ పెరుగుతున్నది. అయితే బహువార్షిక రకాల పూత, కాతకు ఎక్కువ సమయం తీసుకోవడంతో దిగుబడులు తక్కువ. ఇటీవలి పరిశోధనతో ఏకవార్షిక రకాలు అంటే ఆరు నెలలలోనే పూతకు, కాతకు వచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాయి. విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మేలైన దిగుబడుకు సాగులో మెళకువలు పాటించాలి.

నేలలు: 

అన్నిరకాల నేలల్లో మునగ సాగు చేసుకోవచ్చు. అయితే 6.5-8 ఉదజని సూచిక కలిగిన ఇసుక రేగడి నేలలు మిక్కిలి అనుకూలం.

Pidigam Nagaiah, Senior Reporter & Editor, teluguraitu.com

పంట సీజన్:

 జూలై నుంచి మొదలుకొని అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. అయితే సంవత్సరంలో ఏ సమయంలో విత్తినా వేసవిలోనే ఉంటే జనవరి-ఏప్రిల్ మధ్య పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత, కాత ఉంటుంది.

విత్తన మోతాదు:

 ఎకరాకు 200 గ్రాముల విత్తనం అవసరం. ఒక గుంతకు రెండు విత్తనాల చొప్పున 2.5-3 సెం.మీ లోతులో వేయాలి. లేదంటే ముందుగా పాలీ బ్యాగులలో పెంచి, 35-40 రోజుల సమయంలో గుంతలలో నాటాలి. గుంతలను 2-2.5 మీటర్ల దూరంలో 45 సెం.మీ పొడవు, 45 సెం.మీ వెడల్పు, 45 సెం.మీ లోతులో తవ్వాలి. ఒక్కో గుంతకు 15 కిలోల చొప్పున కంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి.

అంతర సేద్యం- ఒక నెల వ్యవధిలో మొలకలు పరిశీలించి, మొలకలు లేని గుంతల్లో మళ్లీ విత్తనాలు నాటాలి. మొక్కలు 75 సెం.మీ ఎత్తు పెరిగినప్పుడు మొదలు పై చివర్లను తుంచితే, పక్క కొమ్మలు ఎక్కువ సంఖ్యలో వస్తాయి. టమాటా, మిరప, బెండ, బొబ్బర్ల పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. అయితే మక్కజొన్నను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయరాదు.

ఎరువులు:

విత్తిన మూడు నెలల్లో గుంతకు 45:15:30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ను ఇచ్చే ఎరువులు వేయాలి. ఆరు నెలలకు పంట పూత సమయంలో మరో దఫాగా 45 గ్రాముల నత్రజని ఒక్కో గుంతలో వేయాలి. విత్తిన మూడో రోజు మొదటి తడిని, ఆ తర్వాత 10-15 రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి.

సస్యరక్షణః

కాయ పండు ఈగ యాజమాన్యం: 

నాటిన 150,180, 210 రోజుల్లో ఎకరాకు 80 గ్రాముల ‘థయోమిథాక్సోమ్ 25 డబ్ల్యూజీ’ని నేలలో వేయాలి. ఎకరాకు 10 కుళ్లిన టమాటాతో కూడిన ఫ్రూట్ టాప్ 500 లీటర్ల నీటిలో కలిపి వేయాలి. స్ఫెనోశాడ్ 45 ఎస్సీని లీటర్ల  నీటిలో  0.3 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. మరోదఫా ఎకరాకు 200 లీటర్ల నీటిలో 500 గ్రాముల ప్రొఫెనోఫాస్ కలిపి పిచికారీ చేయాలి.

బొంత పురుగు యాజమాన్యంః

 మునగ కాండంపై గుంపులుగా చేరి, బెరడును తొలిచి తింటాయి. ఆకులను తొలిచి వేస్తాయి. ఆకు విపరీతంగా రాలిపోతుంది. పురుగు గుడ్లను, లార్వాలను సేకరించి ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టారుకు ఒక దీపపు ఎరను ఉంచాలి. లార్వాలను చంపే ‘బర్నింగ్ టార్చి’ వాడాలి. లీటరుకు రెండు గ్రాముల చొప్పున లేదా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బరిల్ పౌడర్ను వాడి నివారించవచ్చు.

కార్సి పంటః 

మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నంచి 90 సెం.మీ ఎత్తులో కత్తిరించాలి. 4,5 నెలల్లో చెట్టు కాపుకొస్తుంది. మూడు సంవత్సరాల వరకు కార్సి పంట తీసుకోవచ్చు. కత్తిరించిన వెంటనే మొక్కకు 45,15,30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. 30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. ప్రతి సంవత్సరం 25 కిలోల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి.

దిగుబడి: 

హెక్టారుకు 50-55 టన్నుల కాయలు, సాలీనా చెట్టుకు 220 మునగ కాయల దిగుబడి వస్తుంది.

ఏక వార్షిక మునగ రకాలు:

KM-1ః

 విత్తనాలతో సాగు చేయాలి. సాలీనా ఒక చెట్టుకు సరాసరిన 400-500 కాయలు వస్తాయి. నాటిన ఆరు నెలలకే కాపుకొస్తుంది. కాయలు 25-30 సెం.మీ పొడవు ఉంటాయి. మొక్కలు పొదలుగా ఉంటాయి. కాబట్టి కాయ కోత చాలా సులభం. మొదటి కోత తర్వాత భూ మట్టానికి ఒక మీటరు మందం కాండం వదిలి మిగతా భాగం కత్తిరించాలి. కార్సి పంటగా 2-3 సంవత్సరాలు దిగుబడిని ఇస్తుంది.

పీకేఎం-1: 

ఈ రకం విత్తిన 5-6 నెలలకు పూతకొస్తుంది. 7-8 నెలల్లో కోతకొస్తుంది. మార్చి-ఆగస్టు మధ్యలో దిగుబడి ఎక్కువ. ఒక సంవత్సరంలో 4-6 మీటర్ల పొడవు పెరుగుతుంది. 6-12 కొమ్ములు వస్తాయి. కాయలు 75 సెం.మీ పొడవు, 6.3 సెం.మీ వ్యాసార్థంతో ఉండి, 150 గ్రాముల బరువు తూగుతాయి. సాలీనా మొక్కకు 220 కాయలు వస్తాయి. హెక్టారుకు 52 టన్నుల కాయల దిగుబడి ఉంటుంది. తోటలలో అంతర పంటగా, ఈ రకం మునగలో మిరప, వేరుశనగ, ఉల్లి పంటలను అంతరపంటగా పండించవచ్చు. పీకేం-2ః ఇది సంకర రకం. విత్తనాల ద్వారా సాగు చేసుకోవాలి. నాటిన ఆరు నెలల్లో కాత కొస్తుంది. వివిధ పంటల సరళిలో సాగుకు అనుకూలం. కాయలు 120 సెం.మీ పొడవు, 8.3 సెం.మీ వ్యాసార్థంతో ఉండి 70 శాతం కండతో 280 గ్రాముల బరువు తూగుతుంది. కాయలలో విత్తనాలు తక్కువ. కండ ఎక్కువగా ఉంటుంది. సాలీనా చెట్టుకు సరాసరిన 220 కాయలు వస్తాయి. హెక్టారుకు 98 టన్నుల దిగుబడి వస్తుంది. కార్సి పంటను మూడేండ్ల వరకు సాగు చేయవచ్చు.

చిన్న, సన్నకారు రైతులకు లాభం:

– ఏకవార్షిక మునగ సాగుకు తక్కువ మొత్తంలో నీరు అవసరం.

-ఎక్కువ మంది కూలీల అవసరం లేదు. కుటుంబ సభ్యులే వివిధ పనులు పూర్తి చేసుకోవచ్చు.

-ఎరువులు, పురుగు మందులు తక్కువే అవసరం. -ఒక హెక్టారు కంటే తక్కువే సాగు విస్తీర్ణం. కాబట్టి మునగ కాయలను సులభంగా, తక్కువ కాలంలోనే స్థానిక మార్కెట్లకు తరలించవచ్చు.

అధిక సాంద్ర పద్ధతిలో సాగుః

మొక్కల సంఖ్య పెంచటం ద్వారా అధిక దిగుబడిని పొందే అధునాతన పద్ధతి ‘అధిక సాంద్ర పద్ధతిలో సాగు”. సాధారణ పద్ధతికి బదులుగా గుంతలు 1.5 మీటర్ల వరుసలు, ఒక మీటరు దూరంలో వరుసలో మొక్కలు నాటేలా తీసుకోవాలి. దీంతో హెక్టారుకు 13,333 మొక్కలు ఉంటాయి. మొక్కల సాంద్రత పెరుగుతుంది. దీంతోపాటు బిందు సేద్యం పాటించి, ఒక మొక్కకు ఫెర్టిగేషన్ ద్వారా 135:23:45 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్లను అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నత్రజని, పొటాష్ ఎరువులను యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో డ్రిప్ ద్వారా అందించాలి.

విత్తనోత్పత్తిః

రైతులు సొంతంగా ఈ రకాలలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. పూత సమయంలో, వర్షాలు రాకుండా ఉండే విధంగా విత్తన పంట కోసం విత్తనం నాటాలి. ఒక రకం నుంచి మరో రకానికి 500 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే పూత సమయంలో వేడి వాతావరణం అనుకూలం. మొక్క కాండం లక్షణాలు, కాయ అభివృద్ధి ముదిరే దశలలో రకం లక్షణాల ఆధారంగా కల్తీలు ఏరివేయాలి. సంవత్సరం చెట్టుకు 200-250 కాయలు వస్తాయి. ఒక్కో కాయలో 10-13 విత్తనాలుంటాయి. అంటే ఒక్కో చెట్టుకు 600 గ్రాముల నుంచి 1000 గ్రాముల వరకు విత్తన దిగుబడి ఉంటుంది. కాయలు కోసి రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత కాయలు పగులగొట్టి విత్తనాల సేకరించాలి. 8-10 శాతం తేమ వరకు ఆరబెట్టి, ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంచుకుని విత్తనంగా వాడుకోవచ్చు. ఒక కిలో విత్తనానికి రెండు గ్రాముల బావిస్టిన్ విత్తనశుద్ధి చేసి నిల్వ ఉంచుకోవాలి. పాలిథీన్ బ్యాగులలో seed ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

teluguraitu team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow copy.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.